YS Jagan News | ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. ఇంకా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయిందని పేర్కొన్నారు మాజీ సీఎం జగన్. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలంలో ఎంపీపీ ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న వైయస్సార్‌సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేసి ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారని జగన్ వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను పోస్ట్ చేశారు. రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహల్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుందన్నారు. వైయస్సార్‌సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారని ఇంత జరుగుతున్నా.. పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.








