Ys Jagan Comments On Pawan Kalyan | ఏపీలోని కూటమి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సుప్రిమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అటవీ ప్రాంతంలో కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని ఆగస్ట్ 18 2023న ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి తాను లేఖను రాసినట్లు జగన్ పేర్కొన్నారు.
తమ ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారని, చంద్రబాబు ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారని జగన్ మండిపడ్డారు.
తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లేనని విమర్శించారు.
సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదని ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అంటూ జగన్ ప్రశ్నించారు.