Youngsters Making Reels with Police Patrolling Vehicle | పోలీసులు పెట్రోలింగ్ కోసం వినియోగించే ఇన్నోవా కారుతో కొందరు ఆకతాయిలు రీల్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వ్యూస్, లైకుల కోసం ఇంతలా తెగిస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడానికి ఓ కారణం ఉంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈగలపెంట స్టేషన్ కు చెందిన పోలీస్ వాహనాన్ని ఇద్దరు యువకులు తీసుకెళ్లి ధోమలపెంట వద్ద శ్రీశైలం-హైదరాబాద్ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద రీల్స్ చేశారు. పోలీస్ వాహనం నుండి స్టైల్ గా కిందకు దిగుతూ తీసిన వీడియోకు సాంగ్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో పోలీసుల వాహనం చోరీకి గురయ్యిందని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై స్థానిక సీఐ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు మనవడు టిఫిన్ తెచ్చుకోవడానికి అని చెప్పి వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేసినట్లు వెల్లడించారు.
వాహనం దొంగతనం జరగలేదని, ఇది పూర్తిగా ఎస్ఐ నిర్లక్ష్యం అన్నారు. ఎస్ఐ వీరమల్లు పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్ఐకి తెలిసే వారు వాహనాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో కేసు నమోదు చేయలేదన్నారు.