Visakhapatnam Ias Officers Simple Wedding | ప్రస్తుతం వివాహ వేడుకలు హంగూ ఆర్భాటంగా జరుగుతున్నాయి. కుటుంబాలు వివాహ సమయంలో స్థోమతకు మించి మరీ ఖర్చు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు ఐఏఎస్ అధికారులు.
సింపుల్ గా ఆలయంలో దండలు మార్చుకుని, ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నారు. ఇలా వీరు నిరాడంబరంగా పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వరుడు ఐఏఎస్ అధికారి అయిన ఆదిత్యవర్మ ప్రస్తుతం మేఘాలయలోని దాదెంగ్రిలో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వధువు ఐఏఎస్ శ్రీ పూజ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
పెద్దలు వీరిద్దరి వివాహాన్ని కుదిర్చారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని కైలాసగిరి శివాలయంలో దండలు మార్చుకుని, ఆ తర్వాత నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం ఉదయం కైలాసగిరి శివాలయంలో వీరి వివాహం జరిగింది. అనంతరం వన్‌టౌన్‌లోని సూపర్ బజారు కార్యాలయం ఆవరణలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ వివాహం నమోదు చేసుకున్నారు. ఇలా ఈ ఇద్దరు అధికారులు చేసిన పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది.









