Union Minister Gadkari dismisses reports on two-wheeler toll tax | జాతీయ రహాదారులపై ఫోర్ వీలర్స్ మరియు అంతకన్న పెద్ద వాహనాలపై టోల్ ట్యాక్స్ ఉన్న విషయం తెల్సిందే.
ఇదే క్రమంలో ద్విచక్ర వాహనాలపై కూడా జులై 15 నుంచి టోల్ ట్యాక్స్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పలు కథనాలు వెలువడ్డాయి. టూ వీలర్స్ కు కూడా ఫాస్టాగ్ తప్పనిసరి అని తెగ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ విధించబడుతుందని తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి నిర్ణయం ఏదీ ప్రతిపాదించబడలేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు టోల్ పై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నిజాన్ని తెలుసుకోకుండా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం సరి కాదని ఈ ప్రచారాన్ని కేంద్రమంత్రి ఖండించారు. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ అంటూ వెలువడిన కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేసింది.









