Trump unveils $5 million gold card | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన “గోల్డ్ కార్డ్” పథకం ప్రపంచవ్యాప్తంగా సంపన్న వ్యక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా గోల్డ్ కార్డ్ యొక్క ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు.
ఈ గోల్డ్ కార్డ్ ఒక ప్రత్యేక వీసా పథకం, దీని ద్వారా 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.43.5 కోట్ల రూపాయలు చెల్లించిన విదేశీ పెట్టుబడిదారులకు అమెరికాలో శాశ్వత నివాసం మరియు పౌరసత్వ అవకాశం లభిస్తుంది. ఈ కార్డ్‌ను ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మీడియా సమావేశం సందర్భంగా ప్రదర్శించారు.
ఈ గోల్డ్ కార్డ్ బంగారు రంగులో ఉంది. దీనిపై ట్రంప్ యొక్క చిత్రం, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, మరియు ఈగిల్ చిహ్నాలు ఉన్నాయి. “5 మిలియన్ డాలర్లకు ఇది మీ సొంతం అవుతుంది” అని ట్రంప్ విలేకరులతో అన్నారు. దీనిని “ట్రంప్ కార్డ్” అని కూడా పిలిచారు. ఈ కార్డ్ రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.
తానే మొదటి కొనుగోలుదారుడినని, రెండవ కొనుగోలుదారు ఎవరో తెలియదని ట్రంప్ చెప్పారు. ఈ పథకం గ్రీన్ కార్డ్‌కు “ప్రీమియం వెర్షన్”గా పరిగణించబడుతోంది. ట్రంప్ ప్రకారం ఈ గోల్డ్ కార్డ్ పథకం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
గతంలో అమలులో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా కార్యక్రమాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. EB-5లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉండగా, గోల్డ్ కార్డ్‌లో అటువంటి షరతులు లేకుండా నేరుగా రెసిడెన్సీ పొందే సౌలభ్యం ఉంది.
ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే భారీ స్పందన లభించినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుథ్నిక్ తెలిపారు. ఒకే రోజులో 1,000 గోల్డ్ కార్డులు అమ్ముడై, దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా అమెరికాలో నివసించే హక్కుతో పాటు, ఒక సంవత్సరంలోపు పౌరసత్వం పొందే అవకాశం కూడా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.