Transgenders As Traffic Volunteers In Hyderabad | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల నియమించాలని చెప్పారు.
నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ ( Drunk And Drive ) సందర్భాల్లోనూ వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక గుర్తింపు నివ్వడంతో పాటు వారికి అవసరమైన శిక్షణ, హోమ్ గార్డ్ ( Homegaurd ) తరహాలో జీత భత్యాలు సమకూర్చేలా విధి విధానాలతో పాటు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం స్పష్టం చేశారు.