CM Stalin Urges Newlyweds Couple | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamilnadu CM) ఎం కే స్టాలిన్ (MK Stalin) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ వ్యాఖ్యల వెనక ఓ కారణం ఉంది. దేశంలో లోకసభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రం లో లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మరోసారి స్పందించిన స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“కొత్త దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేనే చెప్పాను. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న వేళ ఇప్పుడు అలా చెప్పలేను.
ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి” అని సీఎం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









