Tirupati MP Maddila Gurumoorthy News Latest | దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ ఎంపిక ప్రక్రియను తక్షణమే పునఃసమీక్షించాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డా. శోభిత్ జైన్ కి ఆయన లేఖ రాశారు. ప్రపంచ స్థాయి కాంపౌండ్ ఆర్చర్‌గా భారత్‌కు విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టిన జ్యోతి సురేఖ వెన్నంను వరుసగా ఖేల్‌రత్న సిఫారసుల నుండి తప్పించడంపై ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే అర్జున అవార్డు గ్రహీత అయిన ఇంతటి ఘనత గల క్రీడాకారిణిని ఖేల్‌రత్న రేసులో పరిగణనలోకి తీసుకోకపోవడం ఎంపిక ప్రక్రియలోని పారదర్శకత, నిష్పక్షపాతతపై సందేహాలను లేవనెత్తుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయి అవార్డులు కేవలం గౌరవ సూచకాలు మాత్రమే కాకుండా, ప్రతిభకు పట్టం కట్టేలా ఉండాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఖేల్‌రత్న ఎంపిక విధానాన్ని సమీక్షించి, దీర్ఘకాలిక ప్రతిభ మరియు అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు తగిన న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.









