Dilsukhnagar Bomb Blast Case | పన్నేండేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది.
పేలుళ్లకు పాల్పడ్డ కేసులో ఐదుగురు నిందితులకు గతంలో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కూడా సమర్థించింది. ఆ ఐదుగురు ఉగ్రవాదులకు ఉరి శిక్ష సరైందేనని జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పి. శ్రీసుధలతో కూడా ధర్మాసనం పేర్కొంది.
2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సాయంత్రం 7 గంటల సమయంలో 100 మీటర్ల దూరంలో రెండు చోట్ల బాంబులు పేలాయి. ఈ ఘటనలో 18 మంది మరణించగా.. మరో 131 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుళ్ల ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేపట్టింది.
పలువురు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2016లో NIA ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేశారు. తాజాగా హైకోర్టు కూడా NIA కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సమర్థిస్తూ నిందితుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది.