Telangana decides to close Transport dept check posts on highways with immediate effect | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలని ప్రభుత్వం రవాణా శాఖ అధికారులను ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, చెక్ పోస్టులు మూసి వేయబడినట్టుగా కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచిస్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను తక్షణం తొలగించాలని డీటీఓలకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని చెప్పింది. ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.









