Telangana DCA issues public alert against Coldrif syrup linked to child deaths | కోల్డ్రిఫ్ దగ్గు మందును తెలంగాణ ప్రభుత్వం నిషేదించింది. ఈ దగ్గు మందు వాడడం మూలంగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 14 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు నియంత్రణ సిరప్ ను నిషేధించింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నంబర్ ఎస్ఆర్-13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని, హాస్పిటల్స్, మెడికల్ షాపులు విక్రయించకూడదని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఈ దగ్గు మందు తీసుకున్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దగ్గు మందును సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ దగ్గు మందు తయారు చేస్తున్న తమిళనాడు కాంచీపురం జిల్లా సుంగువర్చతిరాంలోని శ్రీసన్ ఫార్మా కంపెనీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యూనిట్ లో తయారైన కోల్డ్రిఫ్ సిరప్ ను పరీక్షించగా అందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితం.









