CM Revanth Reddy First Speech | తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర నాయకులు, అశేషమైన తెలంగాణ ప్రజల సాక్షిగా సీఎం గా ప్రమాణం చేశారు.
అనంతరం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేసి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు.
“దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా… ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం.
మేం పాలకులం కాదు.. మేం సేవకులం. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా..” అని ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి.