Shreyas Iyer Injury Update | ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడవ వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు తీవ్ర గాయం అయ్యింది. హర్షిత్ రాణా బౌలింగ్ లో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కేరీ భారీ షాట్ కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శ్రేయస్ డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా పట్టుకున్నారు.
ఇదే సమయంలో ఆయన బలంగా మైదానాన్ని ఢీ కొట్టారు. అనంతరం నొప్పితో విలవిలలాడిన ఆయన్ను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. శ్రేయస్ బలంగా మైదానాన్ని తాకడంతో అతడి ప్లీహనికి గాయం అయ్యిందని వైద్యులు పేర్కొన్నారు. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. వైద్యులు నిత్యం శ్రేయస్ ను పర్యవేక్షిస్తున్నారు. గాయం అయిన క్షణాల వ్యవధిలోనే శ్రేయస్ ను ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది.
ఎందుకంటే ఎడమవైపు పక్కటెముకల కింద ప్లీహం అనే అవయవం ఉంటుంది. ఇది అత్యంత సున్నితమైన అవయవం. చనిపోయిన లేదా పాత ఎర్ర రక్తకణాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇదిలా ఉండగా శ్రేయస్ ఆరోగ్యంపై అప్డేర్ ను పంచుకున్నారు టీ-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. శ్రేయస్ త్వరగా కొలుకుంటున్నట్లు, తమతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే తీవ్రంగా గాయపడిన శ్రేయస్ మరో మూడు నెలల పాటు మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది.









