Senior DSP allegedly caught on CCTV stealing cash | మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ పోలీసు ప్రతిష్టను దిగజార్చే ఘటన ఇది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యంత సన్నిహిత స్నేహితురాలి ఇంట్లోనే ఓ మహిళా డిఎస్పీ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మేరకు బాధితురాలు సదరు డిఎస్పీ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో మహిళ పేర్కొన్న వివరాల ప్రకారం..డిఎస్పీ కల్పనా రఘువంశీ పోలీసు హెడ్ క్వాటర్స్ లో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె తన స్నేహితురాలు ఇంట్లోకి వెళ్ళింది. ఈ సమయంలో స్నేహితురాలు స్నానం కోసం వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన డిఎస్పీ ఇంట్లో రూ.2 లక్షల నగదు, ఖరీదైన ఫోన్ ను చోరీ చేసింది.
ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన మహిళ వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ ను పరీశీలించారు. అందులో తన స్నేహితురాలు అయిన డిఎస్పీనే చోరీ చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు. అనంతరం భోపాల్ లోని జహింగీరాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం డిఎస్పీ కల్పన పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.









