Satyavathi Rathod in Queue for Urea | తెలంగాణలో యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. పలు చోట్ల ఘర్షణలు సైతం జరిగాయి. ఇదే సమయంలో యూరియా కోసం మాజీ మంత్రి రైతులతో కలిసి లైన్లో నిల్చున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు ఆమె. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులోని రైతు వేదిక వద్ద రైతులతో కలిసి క్యూ లైన్లో నిల్చున్నారు మాజీ మంత్రి, బీఆరెస్ నాయకురాలు సత్యవతి రాథోడ్. సుమారు గంట పాటు నిల్చున్న అనంతరం అధికారులు తనకు ఒక యూరియా బస్తా ఇచ్చినట్లు అసహనం వ్యక్తం చేశారు.
తన సొంత గ్రామం పెద్దతాండలో తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా కోసం రాగా, కేవలం ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండిపడ్డారు. రైతులు తమ వ్యవసాయ పనులను వదిలేసి వారాల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా యూరియా దొరకడం లేదన్నారు.









