Sanjay Raut Slams PVR Cinemas | పీవీఆర్ ఐనాక్స్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. పీవీఆర్ లో పి అంటే పాకిస్థానా అని అడిగారు. ఆసియా కప్-2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్స్ లో భారత్-పాకిస్థాన్ తలపడనున్న విషయం తెల్సిందే.
ఈ మ్యాచును దేశవ్యాప్తంగా వంద స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇటీవలే పీవీఆర్ ఐనాక్స్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ స్పందించారు. PVRలోని “P” అంటే పాకిస్తానా అని ప్రశ్నించారు. లడాఖ్ లో సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖ వ్యక్తిని పాకిస్తాన్ సానుభూతి పరుడు అని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను దేశవ్యాప్తంగా ప్రసారం చేయడానికి PVR ఎలా సాహసిస్తుందని నిలదీశారు.
ఉగ్రవాదానికి కారణమైన దేశంతో మ్యాచ్‌లను ప్రసారం చేయడం మన అమరుల కుటుంబాలకు నేరుగా అవమానించడమే అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం అంటే ఉగ్రవాదాన్ని సమర్థించడమే అవుతుందని తెలిపారు. దేశభక్తి గల ప్రజలు గమనిస్తున్నారని, ఓపికను పరీక్షించవద్దని పీవీఆర్ కు సంజయ్ రౌత్ హెచ్చరికలు జారీ చేశారు. గతంలోనూ పాకిస్థాన్ తో మ్యాచులను బాయ్ కాట్ చేయాలని రౌత్ డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.









