RSS chief’s remarks on stepping aside at 75 stir political row | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ రిటైర్మెంట్ వయసును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మహారాష్ట్ర నాగపూర్ వేదికగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ..75 ఏళ్ల వచ్చాక రాజకీయాల నుండి తప్పుకుని, ఇతరులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ప్రధాని మోదీని ఉద్దేశించే ఆరెస్సెస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కారణం ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని మోదీకి 75 ఏళ్ళు నిండుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ ఆసక్తికరమైన పోస్టు చేశారు. వివిధ దేశాల్లో పర్యటించి ఆ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించి స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రధాని మోదీకి ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలతో ఘన స్వాగతం లభించిందని ఎద్దేవా చేశారు.
సెప్టెంబర్ 17 నాటికి మోదికి 75 ఏళ్ళు నిండుతాయని మోహన్ భాగవత్ గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 11కు మోహన్ భాగవత్ కు కూడా 75 ఏళ్ళు పూర్తవుతాయని మోదీ గుర్తుచేయాలని సూచించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటూ జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.