Revanth Reddy visits Pashamylaram blast site | సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం సిగాచీ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెల్సిందే.
ఈ ఘటనలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇది నష్టపరిహారం కాదని, బాధితులకు పూర్తి మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని చెప్పారు.
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించిన సీఎం, ప్రభుత్వం అన్ని వైద్య ఖర్చులను భరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. సిగాచీ పరిశ్రమ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని, అలాగే ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఘటన జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటనా స్థలికి రాలేదు.