Notice To Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు (Superstar Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers)పై నమోదైన కేసులో మహేశ్ బాబుకు ఈ నోటీసులు వచ్చాయి. ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు.
ఆ రియల్ ఎస్టేట్ సంస్థ బ్రోచర్ లో హీరో మహేష్ బాబు ఫొటోతో ప్రమోషన్ చేయడం చూసి బాలాపూర్ గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. ప్లాటుకు రూ.34.80 లక్షలు చెల్లించిన తర్వాత ఆ లేఅవుట్ కు అసలు అనుమతులు లేవని తెలిసిందని ఆరోపించారు.
దీంతో కట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలని రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించగా ఆ సంస్థ కేవలం రూ.15 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమె పిటిషన్ విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా, ప్రమోషన్ చేసిన మహేష్ బాబులను ప్రతివాదులుగా పేర్కొంటూ సోమవారం నోటీసులు జారీ చేసింది.
నోటీసులు అందిన వారు జూలై 8 లోపు న్యాయవాదులతో సహా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు.
హీరో మహేశ్ బాబకు నోటీసులు.. ఎందుకో తెలుసా!