Rahul Gandhi Backs English And hits back at Amit Shah | దేశంలో త్వరలోనే ఆంగ్లం మాట్లాడేవారు సిగ్గుపడే సమయం వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజగా వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఇంగ్లీష్ అనేది ఒక ఆయుధమన్నారు. ‘ఆంగ్లం అడ్డంకి కాదు, ఒక వంతెన. ఆంగ్లం సిగ్గు కాదు, శక్తి. ఆంగ్లం సంకెళ్లు కాదు, వాటినే తెంచే ఆయుధం’ అని రాహుల్ పేర్కొన్నారు.
BJP-RSS నేతలు భారతదేశంలోని పేద పిల్లలు ఆంగ్లం నేర్చుకోవడం ఇష్టపడరని ఎందుకంటే వారు ప్రశ్నలు అడగడం, ముందుకు సాగడం, సమానత్వం సాధించడాన్ని ఇష్టపడరని విమర్శించారు. ఆంగ్ల భాష కూడా మాతృభాష అంతే ముఖ్యమని తెలిపారు.
ఎందుకంటే అది ఉపాధి కల్పిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని వివరించారు. భారతదేశంలోని ప్రతి భాషలో ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉందని మనం వాటిని సంరక్షించాలి – అదే సమయంలో ప్రతి బిడ్డకు ఆంగ్లం నేర్పించాలని చెప్పారు.
ప్రపంచంతో పోటీపడే, ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు రావాలంటే ఆంగ్లమే మార్గమని తెలిపారు. మరోవైపు హిందీని ప్రేమించే బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు తమ పిల్లల్ని మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారని విమర్శలు గుప్పించారు.