PM congratulates Vedamurti Devavrat Mahesh Rekhe on completing the Dandakrama Parayanam | ఆయన వయస్సు కేవలం 19 ఏళ్ళు. కానీ రెండు శతాబ్దాల తర్వాత మహా ఘనతను సొంతం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే దండక్రమ పారాయణం పూర్తి చేశారు. 50 రోజుల పాటు నిర్విరామంగా శుక్ల యజుర్వేదలోని మాధ్యంధిన శాఖలోని రెండు వేల మంత్రాలను పారాయణం చేసి చరిత్ర సృష్టించారు. వేద పారాయణంలో దండక్రమ పారాయణ మంత్రాల స్వరాలు, ధ్వని ఖచ్చితత్వం అనేది అత్యంత క్లిష్టంగా ఉంటాయి.
ఈ అసాధారణ ఘనతను సాధించిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖేకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవవ్రత్ మహేశ్ రేఖే సాధించిన ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. తన పార్లమెంటు స్థానం పరిధి పవిత్ర వారణాసి నగరంలో ఈ అసాధారణ సాధన జరిగినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేవవ్రత్ మహేశ్ రేఖేకు దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన సాధువులు, ఋషులు, విద్వాంసులు, సంస్థలకు ప్రధాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.









