Pakistan’s national hockey team was left stranded on Australian streets | పాకిస్థాన్ జాతీయ హాకీ జట్టు ప్లేయర్లకు ఘోర అవమానం జరిగింది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ దేశ ఆటగాళ్లు హోటల్లో గదులు లేక గంటల పాటు రోడ్లపైనే బస చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం, హాకీ ఫెడరేషన్ దారుణమైన నిర్లక్ష్యం కారణంగా ఆటగాళ్లు దయనీయ పరిస్థితిని ఎదురుకున్నారు. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ హాకీ జట్టు ఆస్ట్రేలియా వెళ్ళింది. అయితే ఆస్ట్రేలియా లోని కాన్బేర చేరుకున్న ఆటగాళ్లు ఓ ఫోర్ స్టార్ హోటల్ కు వెళ్లారు. ముందస్తుగానే సదరు హోటల్ లో గదులను బుక్ చేసినట్లు నిర్వాహకులు ప్లేయర్లకు చెప్పారు. అయితే తీరా హోటల్ కు వెళ్లి చుస్తే డబ్బులు చెల్లించని కారణంగా గదుల బుకింగ్ క్యాన్సల్ అయినట్లు హోటల్ సిబ్బంది చెప్పడంతో ప్లేయర్లు కంగుతున్నారు.
చేసేదేమీ లేక రోడ్లపైనే గంటల పాటు బస చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. పాకిస్థాన్ లాహోర్ నుంచి 20 గంటలకు పైగా ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత గదులు లేకపోవడంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు, పాక్ హాకీ ఫెడరేషన్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చేసేదేమీ లేక ఆటగాళ్లు నిస్సహాయంగా రోడ్లపైనే కూర్చున్నారు. వారిని గమనించిన స్థానిక పాకిస్థానీలు డబ్బులు జమ చేసుకుని హోటల్ లో గదులు ఇప్పించారు.










