Pakistani-Origin Father-Son Named as Sydney Shooters | ఆస్ట్రేలియా లో ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 15 మంది మృతిచెందారు. మరోవైపు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ మూలాలు ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం సిడ్నీ నగరం బాండీ బీచ్ లో స్థానిక యూదులు తమ హనుక్కా వేడుకలో పాల్గొన్నారు. కుటుంబాలతో కలిసి సరదాగా గడుపుతున్న సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. అయితే కాల్పులు జరిపింది ఇద్దరు తండ్రీకొడుకులే. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, తన 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ తో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. సాజిద్ అక్రమ్ పాకిస్థాన్ నుండి వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతి చెందగా, నవీద్ అక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇకపోతే వీరిద్దరికి ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిడ్నీ నగర దక్షిన భాగం శివారులో అక్రమ్ నివాసం ఉంది. అతడి వద్ద లైసెన్స్ పొందిన ఆరు తుపాకీలు ఉన్నట్లు వాటినే దాడిలో వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇకపోతే సిడ్నీలో జరిగిన ఉగ్రదాడి యూదు వ్యతిరేక చర్య అని ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ప్రకటించారు.









