Pakistan Incurs Losses After Champions Trophy | ఇప్పటికే పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరింత దిగజారినట్లు తెలుస్తోంది.
తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పట్టుబట్టిన పాక్, ట్రోఫీ నిర్వహణతో దేశంలో క్రికెట్ కు మంచి రోజులు వస్తాయని భావించగా, ఇప్పుడు మాత్రం ప్లేయర్ల మ్యాచ్ ఫీజును ఘోరంగా తగ్గించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి లోని స్టేడియాలకు మరమ్మత్తులు చేసి ఆధునికరించారు. దీని కోసం అనుకున్న బడ్జెట్ కంటే సుమారు 50 శాతం ఎక్కువ ఖర్చు అయినట్లు కథనాలు వస్తున్నాయి.
అయితే స్వదేశంలో పాక్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. తొలి మ్యాచులో ఓడిపోగా, టీం ఇండియా తో జరిగిన రెండవ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ వెళ్ళింది. మూడవ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అనంతరం లీగ్ దశలోనే పాక్ ఇంటి ముఖం పట్టింది.
ఈ క్రమంలో స్వదేశంలో పాక్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడడం, టికెట్ల, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు రూ.869 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
నష్టాల నుండి తీరుకోవడానికి ప్లేయర్ల మ్యాచ్ ఫీజును తగ్గించడం, 5 స్టార్ హోటల్స్ బదులు సాధారణ హోటల్స్ లో ఆటగాళ్లకు బసను ఏర్పాటు చేయడం వంటి పనులకు పీసీబీ పూనుకుంది.