Pak Former Cricketer Blames PM Shehbaz Sharif For Pahalgam Terror Attack | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనెరియా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌పై నిప్పులుచెరిగారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఉగ్రదాడి ఘటనను షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని క్రికెటర్ కనెరియా ప్రశ్నించారు.
“పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్‌కు సంబంధం లేకపోతే, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దీన్ని ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? పాక్ భద్రతా దళాలు హఠాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి? ఎందుకంటే, మీరే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు. వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు. ప్రధాని హోదాలో ఉన్న మీకు సిగ్గుండాలి” అని కనెరియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
పాకిస్థాన్ దేశం, ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని ఆ దేశ మాజీ క్రికెటరే పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే పాకిస్థాన్ లో హిందూ కుటుంబంలో పుట్టిన కనెరియా 2000 సంవత్సరం నుండి 2010 వరకు పాక్ తరఫున ఆడారు.