Operation Sindhu News | ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య దాడులు, ప్రతీ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. డ్రోన్లు, మిస్సైళ్ల దాడులతో ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ సింధు’ ను చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా తొలుత వంద మందికి పైగా విద్యార్థులతో కూడిన బృందం అర్మేనియా మీదుగా భారత్ కు చేరుకుంది.
అయితే ఇరాన్ లో మొత్తం నాలుగు వేలకు పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు వేల మంది విద్యార్థులే. కాగా ఇరాన్ లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందు కోసం ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది. అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. కానీ భారత్ కోసం ప్రత్యేక మినహాయింపు ఇస్తూ గగనతలాన్ని తెరిచేందుకు సిద్ధమయ్యింది.
ఈ క్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు గంటల వ్యవధిలోనే భారత్ కు చేరుకోనున్నారు. ఇరాన్ లోని పలు నగరాల నుంచి వీరు ఇండియాకు రానున్నారు. శుక్రవారం రాత్రి ఒక విమానం స్వదేశానికి చేరుకోనుంది. అలాగే మరో రెండు విమానాలు శనివారం రానున్నాయి.
ఇదిలా ఉండగా ‘ఆపరేషన్ సింధు’ లో భాగంగా ఇజ్రాయిల్ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని కూడా స్వదేశానికి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.