Naga Babu Appreciates Actress Pragathi | తెలుగు సినీ నటి ప్రగతి అరుదైన ఘనతను సాధించిన విషయం తెల్సిందే. ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025”లో ఆమె భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ నాలుగు మెడల్స్ ను గెలిచారు. ఈ క్రమంలో ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించి ప్రగతికి అభినందనలు తెలిపారు. నటనతో పాటు పవర్ లిఫ్టింగ్‌లోనూ అంతర్జాతీయస్థాయిలో రాణించడం అనేకమందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.
ప్రగతి చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేయడం గతంలో తాను ఒకసారి గమనించినట్లు “ఇదేంటి చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేస్తోంది, సరదాకేమో” అని మనసులో అనుకున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. ఇంత నిబద్ధతగా ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తుందని ఊహించలేదన్నారు. వెండితెరపై మెప్పిస్తూ, క్రీడారంగంలోనూ రాణించడం విశేషం, చాలామంది మహిళలకు ఆదర్శం అని ప్రశంసించారు. ప్రగతి సినిమాలతో పాటుగా పవర్ లిఫ్టింగ్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని నాగబాబు ఆకాంక్షించారు.









