Modi tells Trump there was no US mediation in ceasefire with Pakistan | జమ్మూకశ్మీర్ పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు దాయాధి దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదులే లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ ను చేపట్టింది.
అనంతరం చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం అమెరికా మధ్యవర్తిత్వం మూలంగానే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకున్నాడు.
వాణిజ్యాన్ని ఉపయోగించి ఇరు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చినట్లు చాటింపు వేసుకున్నారు. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నేరుగా డోనాల్డ్ ట్రంప్ కే తేల్చి చెప్పారు.
కెనడా వేదికగా జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీ-అధ్యక్షడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా ట్రంప్ సమావేశం నుండి వెళ్లిపోవడంతో ఈ భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు సుమారు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధాని, ట్రంప్ కు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగలేదని ప్రధాని, ట్రంప్ కు వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం అనే అంశంపై కూడా ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.
న్యూ ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్యే కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరిగాయని, పాకిస్థాన్ అభ్యర్ధన మేరకే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాని మోదీ, ట్రంప్ కు స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా భారత మూడవ దేశ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోధని ప్రధాని, ట్రంప్ తో జరిగిన ఫోన్ సంభాషణలో కుండ బద్దలు కొట్టారు. మోదీ, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణ వివరాలను కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి మీడియాకు వెల్లడించారు.