MLA Virupakshi Controversy News | వైసీపీ నేత, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వివాదం లో చిక్కుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామం చిప్పగిరిలో జరిగిన సీతారాముల కళ్యాణంలో విరూపాక్షి పాల్గొన్నారు.
కళ్యాణం సందర్భంగా ఎమ్మెల్యే సీతా దేవి మెడలో తాళి కట్టడం వివాదంగా మారింది. వేద పండితులు నిర్వహించాల్సిన క్రతువును విరూపాక్షి ఎలా చేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వేద పండితులే తనకు తాళిని అందించారని, పండితులు కట్టమంటేనే తాను తాళి కట్టినట్లు క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ఈ వివాదం పై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. హిందూ ధర్మ భక్షకుడు జగన్ రెడ్డి, అతని పార్టీ నేతలు మొదటి నుంచి హిందూ ఆచారాలు, హిందూ ధర్మాన్ని కించపరుస్తూనే ఉన్నారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా సీతమ్మ వారి మెడలో మాంగల్యం కట్టి మహాపచారానికి పాల్పడ్డారని పేర్కొంది.
సీతారామకళ్యాణంలో, పండితులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ, సంప్రదాయబద్దంగా చేయవలసిన క్రతువుని కూడా తమ రాజకీయం కోసం వాడుకున్నారని మండిపడింది. రాములోరి కళ్యాణంలో కూడా రాజకీయ లబ్ది కోసం చూసిన వైసీపీ నేత చర్యపట్ల… జగన్ రెడ్డి హిందూ మత వ్యతిరేకత పట్ల హిందూ ధర్మ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని టీడీపీ వెల్లడించింది.