Man collects 70 tolas of gold jewellery from plane crash site hands them over to police | అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
విమానం కుప్పకూలి మంటలు ఎగిసిపడిన సమయంలో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులను రక్షించడం, వారిని ఆసుపత్రికి తరలించడం వంటివి చేశారు. ఇందులో వ్యాపారి రాజేష్ పటేల్ ఒకరు. తొలుత మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ఆయన ఆ తర్వాత మంటల్లో కాలుతున్న విలువైన వస్తువుల్ని సేకరించి పోలీసులకు అప్పగించారు.
ప్రమాదం జరిగిన తొలి 15-20 నిమిషాల పాటు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత, రాజేష్ పటేల్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ 10-15 కాలిపోతున్న స్థితిలో ఉన్న హ్యాండుబ్యాగులను సేకరించారు.
ఇందులో లభించిన 70 తులాల బంగారం, 10 వెండి వస్తువులు, పాస్పోర్టులు, రూ.50 వేల నగదు, కొన్ని డాలర్లు, భగవద్గీత పుస్తకం మరియు ఇతర వస్తువుల్ని రాజేష్ పటేల్ సేకరించారు. అక్కడే ఉన్న రెస్క్యూ ఆపరేషన్స్ పోలీసు అధికారికి వాటిని అప్పగించి మానవత్వం చాటుకున్నారు.
2008లో అహ్మదాబాద్ లో వరుస పేలుళ్లు జరిగిన సమయంలోనూ రాజేష్ పటేల్ సివిల్ ఆసుపత్రిలో వాలంటీర్ గా సేవలందించారు. ఇకపోతే లభ్యమైన విలువైన వస్తువుల్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.