Libyan trader receives Nokia phones ordered in 2010 after 16-year delay | దూరం కేవలం కొన్ని కి.మీ. లే, కానీ డెలివరీ అవ్వడానికి మాత్రం 16 ఏళ్ళు సుధీర్ఘ సమయం పట్టింది. అప్పుడు ఆర్డర్ చేసిన వస్తువులకు తెగ డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వింత ఘటన నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న ఆఫ్రికాలోని లిబియా దేశంలో చోటుచేసుకుంది. రాజధాని ట్రిపోలిలో ఓ ఫోన్ డీలర్ 2010లో నోకియా బ్రాండ్ మ్యూజిక్ ఎడిషన్ ఫోన్లను ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ చేసిన అనంతరం ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. అనంతరం నెలకొన్న అంతర్యుద్ధం నేటికి ఆ దేశంలో మండుతోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ డీలర్ ఆర్డర్ చేసిన నోకియా ఫోన్లు స్థానికంగా ఓ గోడౌన్ లోనే ఉండిపోయాయి. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆర్డర్ చేసిన వ్యక్తి, సప్లైయర్ కొన్ని కి.మీ. దూరంలోనే ఉంటారు. అయినప్పటికీ యుద్ధం కారణంగా ఫోన్లు గోడౌన్ లో చిక్కుకుపోయాయి. అయితే తాజాగా 2026 సంవత్సరంలో ఆ ఫోన్లు మొబైల్ డీలర్ వద్దకు చేరాయి. సుమారు 16 సంవత్సరాల తర్వాత డెలివరీ అయిన ఫోన్లను చూసి అతడు ఖంగుతిన్నాడు. ఇవి ఫోన్లా లేకపోతే మ్యూజియంలో పెట్టాల్సిన వస్తువులా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. యుద్ధం సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించే ఒక బలమైన ఉదాహరణ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.









