KTR News Latest | కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు శనివారం ‘గద్వాల గర్జన’ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అని సవాల్ విసిరారు. ప్రజల ఆకాంక్షలను, అభిప్రాయాలను తుంగలో తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలను మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజల కోర్టులో తగిన తీర్పు తప్పదన్నారు.
పార్టీలు మారిన ఆ పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. అసలు వాళ్ళది ఏ పార్టీ అనేది చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. స్వార్థం కోసం, ఆస్తులు పెంచుకోవడానికే అవకాశవాదంతో పార్టీలు మారారని విమర్శించారు. ఈ పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా ఉందని తెలిపారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలోని పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని వారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ ధ్వజమెత్తారు.









