KTR News Latest | రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి బుల్డోజర్ రాజ్యం నడుస్తోందన్నారు. ఇళ్లను కూలగొట్టడం, భూములను అమ్మడం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం, ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అని దుమ్మెత్తిపోశారు. మూసీ పేరిట చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇళ్లను రేవంత్ కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు బీఆరెస్ అండగా ఉంటుందన్నారు.
ఈ మేరకు ఆదివారం కేకే నగర్ ఫేజ్-2 నుంచి మధుపార్క్ రిడ్జ్ వరకు పార్టీ నాయకులతో కలిసి మూసి బాధితులకు అండగా కేటీఆర్ ‘మూసి దండియాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు సంవత్సరాలు ఇళ్లను, భూములను కాపాడుకోవాలని బాధితులకు చెప్పారు. బీఆరెస్ ప్రభుత్వం వచ్చాక ఇళ్లను ముట్టకుండా చూసే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. మరో రెండేళ్లు తెలంగాణను కాంగ్రెస్ నుంచి కాపాడుకోవాలన్నారు.










