Komatireddy Fires on Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రులు భగ్గుమన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన దిష్టి వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..తెలంగాణను అవమానించవద్దని, బేషరతుగా క్షమాపణలు చెబితేనే రాష్ట్ర ప్రజలు క్షమిస్తారు అని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ వివాదంతో సంబంధం లేదని ఆయన వివాదాలకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు.
కానీ పవన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి కాగానే ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అనుకోకుండా చేశారా తెలీదన్నారు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెబితే తెలంగాణలో పవన్ సినిమాలు ఒకటి రెండు రోజులు అయినా ఆడుతాయి లేదంటే రాష్ట్రంలోని థియేటర్లలో పవన్ సినిమాలు రిలీజ్ కావు అని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ వ్యాఖ్య చేస్తున్నట్లు కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని హితవు పలికారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని తెలంగాణలో వనరులు వాడుకుని ఆయన ఈ స్థాయికి ఎదిగారని కీలక వ్యాఖ్యలు చేశారు.









