Kishan Reddy News Latest | త్వరలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి కానుందని వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే 96% పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.
హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కొమురవెల్లి వెళ్తుంటారని నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా కొమురవెల్లి ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే కట్టుబాటును కొత్తగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రతిబింబిస్తోందని అన్నారు.










