Kavitha News Latest | కుమార్తె కవితను బీఆరెస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం కవిత హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత శాసనమండలి సభ్యత్వానికి, బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన లేఖను ఛైర్మన్ కు పంపనున్నట్లు తెలిపారు.
అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం కలిసి ఉండవద్దు, విచ్చిన్నం కావాలని కుట్రలు చేస్తున్నారని అందులో భాగంగానే తొలుత తనను బయటకు పంపారని పేర్కొన్నారు.
బీఆరెస్ ను హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఈరోజు తనకు ఎదురైన పరిస్థితే అన్న కేటీఆర్ కు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కేసీఆర్ కు సైతం ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే ‘ నాన్న మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓ సారి చూసుకోండి’ అని కేసీఆర్ ను కవిత కోరారు. భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే సరిపోతుందా అని కవిత తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.









