Kavitha News | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘జాగృతి జనం బాట’ యాత్రను చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరించారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అయితే కవిత విడుదల చేసిన పోస్టర్లో బీఆరెస్ అధినేత, కవిత తండ్రి కేసీఆర్ ఫోటో లేదు. పోస్టర్ పై తెలంగాణ తల్లి, ప్రొ.జయశంకర్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. దీనిపై స్పందించిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి సంస్థగా తాము గతంలో పని చేసిన సమయంలోనూ కేసీఆర్ ఫోటో పెట్టుకోలేదన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయబోతున్నట్లు చెప్పారు.
ఐతే ఇది కేసీఆర్ ని అగౌరవపర్చినట్లు కాదన్నారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని కవిత పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రిజైన్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఫోటోతో ముందుకు వెళ్లటం నైతికంగా సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెట్టు పేరు చెప్పుకొని బతికే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆ చెట్టు నీడ లో ఉన్నంత వరకు దుర్మార్గుల బారి నుంచి చెట్టును కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశానని కానీ ఇప్పుడు తన దారి తాను వెతుక్కుంటున్నట్లు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.









