Jaggareddy News | సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వ్యక్తికి కీలక పదవి ఇచ్చారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండాపూర్ సర్పంచ్ గా ఓడిపోయిన నర్సింహ రెడ్డిని సదాశివ పేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన అభ్యర్థులకు సన్మానం చేశారు జగ్గారెడ్డి సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా.
అలాగే ఓడిన అభ్యర్థులను సన్మానించారు జగ్గారెడ్డి. తాను కూడా ఎన్నికల్లో ఓడినందున ఓడిపోయిన అభ్యర్థులకు సన్మానం చేసినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఖండువా వేసుకుని సర్పంచ్ ఎన్నికల్లో ఓడినా వారు తన దృష్టిలో సర్పంచులే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబెల్ గా నిలబడి గెలిచిన వారికి పార్టీలో నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 45 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినట్లు జగ్గారెడ్డి చెప్పారు.









