IPS Officer Parag Jain Appointed As New R&AW Chief | రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నూతన చీఫ్‌గా పరాగ్ జైన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం శనివారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. జైన్ జూలై 1, 2025 నుంచి రెండేళ్ల నిర్ణీత కాలపరిమితితో ఈ పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30, 2025తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో పరాగ్ జైన్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. పరాగ్ జైన్ గూఢచార రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన అధికారి. ఆయన ప్రస్తుతం రా యొక్క ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ఏఆర్‌సీ) అధిపతిగా ఉన్నారు. ఇది వైమానిక నిఘా మరియు సాంకేతిక గూఢచార సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తుంది.
పరాగ్ జైన్ తన కెరీర్‌లో పంజాబ్‌లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో బఠిండా, మన్సా, హోషియార్‌పూర్ వంటి జిల్లాల్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) మరియు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పనిచేశారు.
జైన్ కెనడా మరియు శ్రీలంకలో భారత దౌత్య కార్యాలయాల్లో ప్రాతినిధ్యం వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు మరియు ఆపరేషన్ బాలాకోట్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇటీవల పాకిస్థాన్ లోని ఉగ్రశిభిరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు.
ఈ ఆపరేషన్‌లో, ఆయన నాయకత్వంలోని ఏఆర్‌సీ సమకూర్చిన గూఢచార సమాచారం ద్వారా పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు సాధ్యమయ్యాయి.









