Influencer Bayya Sunny Yadav booked for promoting online betting apps | బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనర్ ( Sajjanar ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులకు కక్కుర్తి పడి సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ కారణంగా అమాయకులు బలి అవుతున్నారని సజ్జనర్ పేర్కొన్నారు. ఇప్పటికే సజ్జనర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఆధారంగా ఏపీకి చెందిన యూట్యూబర్ ( Youtuber ) లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే.
తాజగా ప్రముఖ మోటోవ్లాగర్ ( Moto Vlogger ) బయ్యా సన్నీ యాదవ్ అలియాస్ బయ్యా సందీప్ పై పోలీస్ కేసు నమోదైంది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సజ్జనర్ స్పందించారు.
బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లపై తాను చేసిన ‘ఎక్స్’ ( X ) పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన సూర్యాపేట పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని హెచ్చరించారు. చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.
మాకు మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్ట తప్పదని సజ్జనర్ వార్నింగ్ ఇచ్చారు.









