India Suspends Water Flow To Pakistan Through Baglihar Dam On Chenab River | జమ్మూకశ్మీర్ రాంబన్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ డ్యాం మూలంగా పాకిస్థాన్ ప్రభుత్వం తలపట్టుకుంటుంది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. ఉగ్రదాడి వెనుక పాక్ ప్రభుత్వం, ఆర్మి హస్తం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పలు కీలక దౌత్య పరమైన నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో ఒకటి సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన నీటిని భారత్ నిల్వచేసుకోవడం, దారి మళ్లించడం చేస్తుందని పాక్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో రాంబన్ జిల్లాలో చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ డ్యాం గేట్లను భారత్ మూసివేసింది.
రిజర్వాయర్ నుంచి బురదను తొలగించడానికి గేట్లను చాలా వరకు మూసివేసినట్లు, దీని మూలంగా పాకిస్థాన్ వైపు నీటి ప్రవాహం 90 శాతం తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. అయితే రిజర్వాయర్ లో పూడిక తీయడం ఇదే తొలిసారి కాదని గతంలో అనేక సార్లు చేసినట్లు అధికారులు వివరించారు.
బగ్లిహార్ తో పాటు ఉత్తర కశ్మీర్ లోని జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ఆనకట్ట గేట్లను కూడా మూసివేయాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో పాక్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భారత నిర్ణయాలతో పాక్ వైపు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుందని ఆ దేశం భయపడుతోంది.
ఈ క్రమంలో ఉగ్రవాదులను ఉసిగొల్పడం ఎందుకు, ఇప్పుడు బాధపడడం ఎందుకు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.









