India becomes world’s largest rice producer | భారతదేశం ప్రపంచానికి అన్నపూర్ణగా అవతరించింది. వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానం చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదివారం ప్రకటించారు. దేశ వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకుందని, మరోవైపు చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. ఇది దేశం సాధించిన విజయం అని హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆహార కొరతతో ఇబ్బంది పడిన దేశం ఇప్పుడు స్వయం సమృద్ధిగా ఎదిగి ప్రపంచానికి ఆహారాన్ని అందించే స్థితికి చేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
బియ్యాన్ని పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తూ తగినంత ఆహార నిల్వలను కూడా కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన 25 రకాల పంటలకు సంబంధించి 184 మెరుగైన విత్తన రకాలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. దేశం అధిక దిగుబడి గల విత్తనాల అభివృద్ధిలో గొప్ప విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ కొత్త రకాలను త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.









