iBomma kingpin stole data of five million users | ఐ-బొమ్మ రవి. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఐ బొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లను సృష్టించి ఉచితంగా కొత్త సినిమాలు ప్రేక్షకులకు అందించే నెపంతో లక్షల మంది యూజర్ల డేటాను కొట్టేశాడు. వీటిని సైబర్ నేరగాళ్లకు, బెట్టింగ్ యాపులను అమ్మేసి రూ.20 కోట్ల వరకు వెనకేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే రవి ఇలా మారడానికి వ్యక్తిగత జీవితంలో ఎదురుకున్న అనేక అవమానాలే కారణం అని తెలుస్తోంది. ఇటీవల విదేశాల నుండి వచ్చిన రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లో రవి ఓ యువతిని ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెది సంపన్న కుటుంబం. రవి సంపాదన తక్కువగా ఉండడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే సమయంలో భార్య, అత్త రవికి సంపాదించడం రాదు అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారని ఈ పైరసీ మాఫియా కింగ్ పిన్ పోలీసుల విచారణలో తెలిపారు.
ఇలా కాలేజి చదివే రోజుల్లో ఎదురైన అవమానాలు, భార్య, అత్తల సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక వేధనకు లోనైన రవి త్వరగా డబ్బులు సంపాదించే మార్గంపై కన్నేశాడు. ఇలా బీఎస్సి కంప్యూటర్స్ చదివి, వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవంతో రవి ఐ బొమ్మ, బప్పం టీవీలను రూపొందించాడు. అనంతరం ఇందులో పైరసీ మూవీలను అప్లోడ్ చేసేవాడు. అనంతరం బెట్టింగ్ యాపుల నుండి ప్రకటనల ద్వారా రూ.కోట్లలో డబ్బు వచ్చి పడింది. అయితే సంపాదన వచ్చినప్పటికీ రవి భార్య అతనితో సంతోషంగా లేదు. ఈ క్రమంలో 2021లో వీరిద్దరూ విడిపోయారు. అయినప్పటికీ రవి మాత్రం తన అక్రమ సంపాదన మార్గాన్ని వీడలేదు. యూజర్ల డేటాను విక్రయించడం ద్వారా కూడా రూ.కోట్లు వెనకేశాడు.
హైదరాబాద్ సీపీ సజ్జనర్ తెలిపిన వివరాల ప్రకారం 1972లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ నుండి ఇటీవల విడుదలైన ఓజి వరకు ఇలా 21 వేలకు పైగా సినిమాలను పైరసీ చేశాడు. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న రవి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశపు పౌరసత్వాన్ని డబ్బులు వెచ్చించి మరీ కొనుగోలు చేశాడు. అనంతరం యూరోప్ కు మకాం మార్చాడు. హైదరాబాద్ లోని తన ఫ్లాట్ ను అమ్మేసి యూరోప్ లోనే స్థిరపడాలని భావించిన రవిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.









