I Bomma Ravi News | సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ రవి మరియు మావోయిస్టు అగ్ర నేత హిడ్మా వంటి వారు మరో వందమంది పుట్టుకొస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన..ఐ బొమ్మ రవి ఇలా మారడానికి వ్యవస్థలో లోపాలే కారణం అని అన్నారు. ఆరేడు వందలు ఇచ్చి మరీ సినిమాలు చూడడం ఎలా అని అనుకున్న సమయంలో తాను కూడా ఐ బొమ్మలో సినిమాలు చూసినట్లు పేర్కొన్నారు.
వ్యవస్థలో లోపాలు సరి చేయకుంటే రవి లాంటి వారు మరో వందమంది పుట్టుకు వస్తారని వ్యాఖ్యానించారు. ఐ బొమ్మ రవిని ఉరి తీస్తేనో, శిక్షిస్తేనో ప్రయోజనం ఉండదని సినిమా మాఫియాపై చర్యలు తీసుకోవాలన్నారు. రూ.వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని అడుక్కుంటున్న వారికి ప్రభుత్వం సహాయం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. హిడ్మాను చంపితే మరో వందమంది హిడ్మాలు వస్తారని అలాగే రవి పోతే కూడా మరో వందమంది ఐ బొమ్మ రవీలు వస్తారని నారాయణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.









