Hyderabad Police Warning | నూతన సంవత్సర వేడుకల వేళ మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. డ్రంక్ డ్రైవింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటనలపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
మద్యం సేవించి వాహనం నడుపుతూ, అర్ధరాత్రి పోలీసులతో వాదనలు చేస్తూ భారత చట్టాల్లో లేని సెక్షన్ 123, సెక్షన్ 567 అంటూ కల్పిత నిబంధనలను చెబితే చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ ఓ ట్వీట్ చేశారు.
మద్యం మత్తులో వాహనం నడపడమే కాకుండా.. చట్టంపై పరిజ్ఞానం ఉన్నట్టుగా నటిస్తూ పోలీసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడం కూడా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తనకు కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
‘డ్రంకెన్ డ్రైవిక్ చేసిన వారు పోలీసులతో వాగ్వాదం చేసే దృశ్యాలు కుటుంబ, స్నేహితుల వాట్సాప్ గ్రూపులు మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతాయి.నిబంధనలు ఉల్లంఘించిన వాహనం పోలీస్ స్టేషన్‌లో నిర్భందానికి వెళ్తుంది.
వాస్తవ చట్టాలు, సెక్షన్లను అసలు న్యాయవాది చదివి వినిపిస్తారు. అప్పటికి మీ తప్పుడు పరిజ్ఞానం బహిర్గతమవుతుంది. చట్టం ముందు అహంకారానికి చోటు లేదు. అప్పీల్ లేదు. ఎలాంటి మినహాయింపు లేదు.
మద్యం సేవించి వాహనం నడపడం, అర్ధరాత్రి చట్ట నిపుణులమని నటించడం ఆమోదయోగ్యం కాదు. ప్రజల ప్రాణాల భద్రతే పోలీసుల ప్రథమ లక్ష్యం. డ్రంక్ డ్రైవింగ్‌పై సహించేది లేదు. నిబంధనలు పాటించి, సురక్షితంగా ప్రయాణించండి’ అని ప్రజలను పోలీసులు సూచించారు.








