Hurricane Melissa | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం తుఫాన్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆ తర్వాత మొంథా తుఫాన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. దీని మూలంగా ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మెలిస్సా తుఫాన్ కరేబియన్ దేశాలను అతలాకుతలం చేస్తుంది.
మొంథా తుఫాన్ ప్రభావంతో 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచిన విషయం తెల్సిందే. కానీ మెలిస్సా తుఫాన్ మూలంగా మాత్రం గాలులు ఒకానొక దశలో 295 కి.మీ. వేగంతో దూసుకువచ్చాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టిన హరికేన్ మెలిస్సా జమైకా దేశంపై విరుచుకుపడింది. 174 ఏళ్ల దేశ చరిత్రలోనే ఇంతటి తుఫాన్ రాలేదు. తుఫాన్ తీరం దాటే సమయంలో 295 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఈ క్రమంలో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. సగం దేశానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
జమైకాలో కేటగిరి 5లో ఈ తుఫాన్ ను చేర్చారు. ఆ తర్వాత మెలిస్సా క్యూబా వైపు దూసుకువచ్చింది. ఇక్కడ కూడా భయంకర గాలులు, భారీ వర్షాలు, రాకాసి అలలు భయానక పరిస్థితిని తీసుకువచ్చాయి. లక్షలాది మంది ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. ఈ తుఫాన్ కారణంగా కరేబియన్ దేశాల్లో పది మంది వరకు మరణించారు.









