Harish Rao Fires On CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు. సింగరేణి సంస్థకు చెందిన రూ.10 కోట్లతో ముఖ్యమంత్రి మెస్సితో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారని మండిపడ్డారు. తన ఫుట్బాల్ సోకు కోసం, మెస్సితో ఫోటోలు దిగడం కోసం సింగరేణి డబ్బులు ఎలా వాడుకుంటారు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవేమన్న ‘మీ అయ్య సొత్తా’ అని ఘాటు విమర్శలు చేశారు.
ఓ వైపు కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకుంటే, బ్యాంకుల్లో అప్పులు తెచ్చి సంస్థను నడిపిస్తున్న సమయంలో రూ.10 కోట్లతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించడం ఏంటని నిలదీశారు. ఈ మేరకు శనివారం సింగరేణి కార్మికుల సమస్యలపై సంస్థ సీఎండీని కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ట్రాన్స్‌కో, జెన్‌కో సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడం లేదన్నారు.









