Guntur Police Conduct Barefoot Parade of Rowdy Sheeters | జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లకు, నేర చరిత్ర కలిగిన వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు గుంటూరు పోలీసులు. జిల్లాలో తరచు నేరాలకు పాల్పడుతున్న, రౌడీయిజం చేస్తున్న సుమారు వందమందిని కౌన్సిలింగ్ కు పిలిచారు పోలీసులు. ఈ క్రమంలో వారిని డార్మేటరీ ప్రాంతానికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం, గుంటూరు నగరంలోని లక్ష్మిపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిస్సా విగ్రహం వరకు రౌడీషీటర్లతో పరేడ్ నిర్వహించారు. ఇందులో చెప్పులు లేకుండా వారిని నడిపించారు.
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాటిని అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు, అవసరమైతే PD యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.









