GHMC Merger 2025 | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (Greater Hyderabad Municipal Corporation) లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే.
ఇటీవలే హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం అయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
2026 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు రేవంత్ రెడ్డి వైఎస్సార్ రాజకీయాన్ని అనుసరిస్తున్నారని పలువురి అభిప్రాయం. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ముందు నుండి కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదు. సొంత బలంతో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని దక్కించుకోవాలని దశాబ్దాలుగా హస్తం నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
2002లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. అప్పుడు కేవలం 99 వార్డులో ఉండగా ఎంఐఎం తొలి, టీడీపీ రెండవ స్థానంలో నిలిచాయి. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్సార్. అనంతరం హైదరాబాద్ కార్పిరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా 2007లో హైదరాబాద్ కార్పోరేషన్ పక్కన ఉన్న 12 మున్సిపాలిటీలను, 9 గ్రామ పంచాయతీలను ఎంసీహెచ్ లో కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ గా మార్చారు. అప్పుడే 150 వార్డులతో జీహెచ్ఎంసీ ఏర్పడింది.
అనంతరం 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సరిగ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇలానే చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
2016, 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలవగలిగింది. మరోవైపు ఎంఐఎం, బీఆరెస్ అలాగే బీజేపీ తమతమ కంచుకోటలను నిర్మించుకున్నాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ పక్కన ఉన్న మరో 27 మున్సిపాలిటీలను కార్పోరేషన్ లో కలిపి వార్డుల సంఖ్యను 150 నుండి 300కు పెంచారు. ఇలా ఎంఐఎం, బీఆరెస్, బీజేపీ బలాన్ని గణనీయంగా తగ్గించారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.









